• Blog
  • HOME
  • పాఠకులకు సూచనలు
  • మా గురించి..
  • రచయితలకు సూచనలు
  • సంప్రదించండి
  • హోం
  • కథ
    • కథలు
    • అనువాద కథలు
  • కవిత
    • పద్యాలు
    • కవితలు
  • నవల
    • సీరియల్స్
    • నవలలు
  • వ్యాసం
    • వ్యాసాలు
    • సమీక్షలు
  • సృజన పథం
    • కథలు
    • కవితలు
  • వీడియోలు
  • సంచికలు
  • రచయితలు
  • పత్రికలు
    • తెలుగువెలుగు
    • సారంగ పక్షపత్రిక
    • ఈమాట
    • సంచిక
    • గోదావరి
    • గో తెలుగు
    • సహరి
No Result
View All Result
  • హోం
  • కథ
    • కథలు
    • అనువాద కథలు
  • కవిత
    • పద్యాలు
    • కవితలు
  • నవల
    • సీరియల్స్
    • నవలలు
  • వ్యాసం
    • వ్యాసాలు
    • సమీక్షలు
  • సృజన పథం
    • కథలు
    • కవితలు
  • వీడియోలు
  • సంచికలు
  • రచయితలు
  • పత్రికలు
    • తెలుగువెలుగు
    • సారంగ పక్షపత్రిక
    • ఈమాట
    • సంచిక
    • గోదావరి
    • గో తెలుగు
    • సహరి
No Result
View All Result
No Result
View All Result

‘న్యూస్ ఛానల్’ గొట్టాల మీద మట్టికొట్టిన కథ

ఎడిటర్ by ఎడిటర్
March 16, 2021
in సమీక్షలు
0
‘న్యూస్ ఛానల్’ గొట్టాల మీద మట్టికొట్టిన కథ

కె.ఎ.మునిసురేష్ పిళ్లె కథ ‘రాతి తయారీ’ 2005 జూలై 13న నవ్య వారపత్రికలో వచ్చింది. ‘తెలుగు పలుకు’ పేరుతో తానా సావనీర్ కోసం నిర్వహించిన కథల పోటీలో మొదటి బహుమతి వచ్చిన కథల్లో ఒకటిగా నిలిచింది. ఇక ఉత్తమ కథల సంకలనం కథా సాహితి వారి ‘కథ 2005’ కూడా ఆఏటి 13 మంచి కథల్లో ఒకటిగా నిలిచింది. అయితే ఇన్ని ప్రత్యేకతలు ఉన్న ఈ కథ రచయితకు మొదటి కథ!

‘న్యూస్ ఛానల్’ గొట్టాల మీద మట్టికొట్టిన కథ –

కె.ఎ.మునిసురేష్ పిళ్లె – ‘రాతి తయారీ’

‘‘హల్లో’’

‘‘హల్లోల్లేవ్! హరి అప్, హరి అప్. నిద్దర్లేచావా? రాత్రి ఇల్లు చేరేటప్పటికి ఒంటిగంట దాటినట్లుంది! ఉరుకు ఉరుకు! అవతల రైతు బిడ్డొకడు ఆత్మహత్య చేసేసుకున్నాట్ట. బిడ్డంటే మరీ పసివాడేం కాదులే… ఇరవయ్యేళ్లుండొచ్చుట. అప్పు మరీ లక్షల్లో కాదుగానీ, కుటుంబం బాగా చితికిపోయిందిట. పురుగుల మందు తాగి… కలెక్టరాఫీసు మెట్లమీద రాత్రి…’’

‘‘ఆఁ! కానీ…’’

‘‘అదే చెప్తున్నాకద! కలెక్టరాఫీసు మెట్లమీద రాత్రి ఏ వేళలోనో పురుగుల మందు తాగి పడిపోయాట్ట. ఇంకా బాడీ అలాగే ఉందిట. పోలీసులు వచ్చి తీసేసేలోగా మనం అక్కడుండాలి. విజువల్స్ అదిరిపోవాలి. ఎదురుగా ఏదైనా పెద్ద బిల్డింగుంటే మనవాణ్ని ఎక్కించి ఏరియల్ వ్యూ తీయించు. పురుగుల మందు తాగాడు కద… నోట్లో నురగలు, ఈగలు ముసరడాలు అన్నీ క్లోజప్ లో క్లియర్ గా ఉండాలి… విజువల్స్ వెంటనే రావాలి. ఇపుడు కాప్సూల్ లోనే వేసేస్తాం వింటున్నావా… హ…లో….’’

కథలోని మొదటి రెండు పేరాలివి. అవి చదివాక ఇంక చెప్పడానికి ఏముంది. అర్థమైపోతూనే ఉంది. కథ ‘ఎలక్ట్రానిక్ మీడియా’ గురించి అని! అసలు తెలుగు వారికి సరియైన డాక్యుమెంటేషన్ చేసుకునే అలవాటు లేదని ఒక నింద మనమీద ఉండటం అయితే ఉందికానీ, తెలుగు కథకులు మాత్రం తమ దృష్టికి వచ్చిన ఏ ఒక్క అంశాన్ని వదలకుండా రికార్డు చేస్తూనే ఉన్నారు. ప్రస్తుతం నవలను రెండవ స్థానంలోకి నెట్టి ముందుకొచ్చిన కథ మన సాంఘిక ఆర్థిక సాంస్కృతిక పరిణామాలను ప్రతి దశలోనూ డాక్యుమెంట్ చేస్తూనే ఉందని మన కథల పరిణామ తీరును నాలుగైదు దశాబ్దాలుగా పరిశీలిస్తున్న సీనియర్ కథకులు స్పష్టం చేస్తూనే ఉన్నారు. 1995 తర్వాత విస్తరిస్తున్న శాస్త్ర సాంకేతిక వృద్ధిని ఉపయోగించుకుని తెలుగులో కూడా శాటిలైట్ ఛానల్స్ ఒక ఉధృతిగా ప్రవేశించిన వైనం మన జ్ఞాపకాల్లో ఇంకా తాజాగా ఉన్న నిన్నటి చరిత్రే! దానికి మరొక పదేళ్ల ముందుకు వెళ్తే – చీకటిపడగానే నలుపు – తెలుపు టి.వి.లో శాంతి స్వరూప్ చదివే తెలుగు వార్తలు, తెలుగు కార్టూనిస్టులకు గనిగా వర్ధిల్లిన టీవీ ‘పాడిపంటలు’ కార్యక్రమాలు, కొన్ని నాటకాలు వంటి – సింగిల్ ఎపిసోడ్స్; 8-45 కల్లా ‘ఓవర్ టు ఢిల్లీ’ దాంతో తెలుగు కార్యక్రమాలకు శుభం కార్డు! ఈ చరిత్ర కూడా మనం ఇంకా మర్చిపోలేదు. 1982 ఆసియా క్రీడల సందర్భంగా గాని మన దేశంలోకి రంగుల టీ.వి. రాలేదు. అదొక ఆరంభదశ. ఇంకా మనం 80లలోకి ప్రవేశించిన రోజుల్లో హైదరాబాద్ లో మసబ్ ట్యాంక్ నుండి మెహిదీపట్నం వైపుకు వెళ్లేప్పుడు ఎడమవైపు విజయనగర్ కాలనీలోని ఇళ్లమీద కన్పించే టీ.వీ. యాంటెన్నాల గుంపు ఒక విలక్షణ దృశ్యం. ఇంక బస్టాప్ ల వద్ద ‘ది సాలిడ్ స్టేట్’ అని కన్పించే ట్యాగ్ లైన్ తో డయనారా నలుపు తెలుపు టీవీ ప్రకటనలు అదొక ఆరంభ దశ. కాని ఈ శాటిలైట్ ఛానల్స్ వచ్చాక మొత్తంగా మనలో ప్రతి ఒక్కరి జీవితాల్లో చోటు చేసుకున్న మార్పు పరిణామాలు ఒకసారి స్థిమితంగా పునరావలోకనం చేసుకుంటే – కథకుడు ఈకథకు పెట్టిన పేరు – ‘రాతి తయారీ’ ఎంతో కొంత మోతాదులో, మనలో కూడా ఉందనేది మనం మనలో మనమైనా అంగీకరించవలసిన వాస్తవమేనేమో.

అవును స్థాయి బేధమే గాని, శాటిలైట్ ఛానల్ కార్యక్రమాలు, మరీ ముఖ్యంగా ఇబ్బడి ముబ్బడిగా పెరుగుతున్న న్యూస్ ఛానల్స్ ఉదృతి తర్వాత మనం అందరం ఒక తీరుగానే ఉన్నాం. విషయం ఏదైనా కానివ్వండి కాని, మనకు ఏమి! ఎంత కావాలి? అనేవి మాత్రం ఎప్పుడూ పాతప్రశ్నలే! అస్సలు రోజులొ 24 గంటలు మనకు సరిపోనట్టే. నాలుగు వైపుల నుండీ వచ్చేది కూడా మనకు చాలక, పైనుండి – క్రింది నుండి కూడా మరో రెండు వైపుల్ని అదనంగా కలుపుకుని ఇప్పుడు మొత్తం ఆరువైపుల నుండి అన్నట్టుగా మనకు సమాచారం అందే వెసులుబాటు వచ్చేసింది! సరిపోతుందా ఇంకా కావాలా? (అప్పుడే చెప్పడం కష్టం) నాలుగు గ్లాసులో లేదా ఒక చెంబులో నీళ్లతో తడిచే స్పాంజి ముక్కను తీసుకెళ్లి గ్యాలన్ల కొద్దీ పట్టేనీళ్ల ట్యాంకులో పడేస్తే అదేం చేస్తుంది. ఆ చెంబుడు నీళ్లు పీల్చుకుంటుంది. తర్వాత దానికుండే పీల్చే లక్షణం అది కోల్పోతుంది.

ఈ కథలో న్యూస్ ఛానల్ రిపోర్టర్ ది అదే పరిస్థితి. కథ అతనే మనకు చెబుతాడు కనుక అతని పేరు మనకు తెలియదు. కాని అతని అసిస్టెంట్ రమేష్ (కెమెరామెన్) అతన్ని ‘అన్నా’ అంటుంటాడు. కనుక ప్రస్తుతానికి మనం కూడా అతన్ని అలాగే పిల్చుకుందాం. ఈ ‘అన్న’కు చావుకబురయినా, పెళ్లి కబురయినా ఒకటే లెక్క ఒకటే కొలత. కాకపోతే అక్కడ మనుష్యులు బతికి ఉంటే వాళ్లతో మాట్లాడిస్తాడు, లేదా చనిపోతే వాళ్ల తరుపున తానే మాట్లాడుతాడు. ‘వార్త’ చనిపోయిన వారి గురించా, బ్రతికి ఉన్న వారి గురించా అన్నది ‘అన్న’కు అస్సలు విషయం కానేకాదు ‘పోటీ చానల్’ వాళ్లకంటే ముందు మనం మన ఛానల్లో వార్త – ‘విజువల్స్’ ఇచ్చామా లేదా అన్నది ఒక్కటే పాయింట్. వ్యాసం ఆరంభంలో మీరు చదివిన రెండు పేరాలలో ‘‘హల్లో’’తో అన్న దినచర్య మొదలయింది కదా. ఇక చూడండి ఏమి జరుగుతుందో!

‘అన్న’ చెబుతున్నాడు –

‘‘ఎలక్ట్రానిక్ మీడియాలో రిపోర్టింగ్ చచ్చేంత చావు. పేపర్లలో పన్చేసినంత కాలం ఓ మోస్తరు సంఘటన ఏది జరిగినా రాత్రి పదిగంటల్లోగా వివరాలు ఫోన్లమీద తెలుసుకుని వార్త రాయడం అలవాటైపోయింది. టీవీల్లో, అదికూడా నిరంతరాయ వార్తా ప్రసారాలు వచ్చేసిన తర్వాత ‘ఎవ్విరి సెకెండ్ కౌంట్స్’ అంటాడు మా బాస్. హైదరాబాదు డెస్కులో ఓ టోల్ ఫ్రీ నెంబరు ఏర్పాటు చేశాక మరీ… మా దుంప తెగుతోంది. రాష్ట్రంలో ప్రతీవాడూ ఏ చిన్న సంఘటన కంటబడినా వెంటనే ఫోన్చేసి చెప్పేస్తున్నాడు. ఇక మొదలవుతుంది హైరానా. మీ ఊళ్లో ఫలానా ఘోరం జరిగింది, ఇంకా తెలుసుకోకపోతే ఎలా? వెళ్లు? వెళ్లి విజువల్స్ త్వరగా పంపు… అంటూ అడుసు కయ్యలో కదలని కాడెద్దును ములుగర్రతో అదిలించినట్లుగా వెంటబడుతూనే… ఉంటారు. ఒక్కోసారి ప్రాణం ఎంత విసిగిపోతుందంటే… ఈ వెంటబడే వాళ్ల ఫోన్లన్నీ మాట్లాడేలోగా పుణ్యకాలం కాస్తా గడచిపోతుంటుంది.

రిమోట్ అందుకుని టీవీ ఆన్ చేశాను. బ్రేకింగ్ న్యూస్ వస్తోంది. ఒంగోలు కలెక్టరు కార్యాలయం మెట్లమీద యువరైతు ఆత్మహత్య! వెంటనే మా పోటీ ఛానల్ కెళ్లాను. ఏదో చర్చ నడుస్తోంది. చర్చకోసం కాదుగానీ, అలాగే ఓ పదినిమిషాలు ఆ ఛానల్ చూస్తూ గడిపాను. అదే చర్చ! థాంక్ గాడ్ వీడింకా వేయలేదు. మళ్లీ పోటీ ఛానెల్ లోకి వెళ్లేసరికి వాడు కూడా బ్రేకింగ్ న్యూస్ ఇచ్చేశాడు. ఎలక్ట్రానిక్ మీడియాలో ఇదో తలనొప్పి. సమాచారం వరకూ యథేచ్చగా కాపీ జరిగిపోతుంది అడిగే దిక్కులేదు. మళ్లీ మా ఛానెల్ కెళ్లాను. వార్తలు మొదలై మొట్టమొదటి రైతు శవం విజువల్ వేశారు. ‘వెల్ డన్ రమేష్’ మనసులో అభినందించేశాను.

ఇక పర్లేదు. ఓ కునుకు తీసి కదలొచ్చు. టీవీ కట్టేసి కళ్లు మూసుకున్నాను.  కునుకుకు స్పీడ్ బ్రేకర్లలాగా మళ్లీ సెల్ మోగింది. అన్నా బాడీ క్లియర్ చేసేశారు. పోస్టుమార్టం తర్వాత వాళ్ల పల్లెకు తీసుకెళ్లిపోతారు. నువ్వు హడావుడి పడొద్దు. మనం భోంచేసి అక్కడికెళ్తే చాలు.

వీడికి నామీద ఎంత నమ్మకమో.

సరే నువ్వు ఇంటికెళ్లి భోంచేశాక ఇటోచ్చేయ్ ! వస్తూ ఓ బిర్యానీ పార్సిల్ పట్రా.

ఇక పూర్తి కునుకే తీయొచ్చు. సమాచారం తెలిసి మనసు నెమ్మదించగానే, సెల్ స్విచాఫ్ అయిపోయింది! కళ్లు మూతలు పడిపోయాయి!!’’

ఇప్పుడు ‘అన్న’ ఆత్మహత్య చేసుకున్న యువరైతు ఊరికి తన కెమేరామెన్ రమేష్ తో కలిసి బైక్ మీద బయల్దేరాడు. అన్న అక్కడికి చేరుకునేలోగా కాస్సేపు మళ్లీ నేను. కమర్షియల్ బ్రేకుల్లేని సింగిల్ ఎపిసోడ్ లా ఏకబిగిని సాగుతుంది కథ. పొద్దున్నే ‘‘హల్లో’’ అంటూ ‘‘అన్న’’ నిద్ర లేచింది మొదలు; ఆరున్నర పేజీల్లో, (చదవడానికి) 20 నిముషాలలోపు ‘అన్న’ తన ఛానల్ కు ఎలా అదనపు న్యూస్ మైలేజ్ స్కోర్ చేశాడో మనకు చెప్పడంతో కథ ముగుస్తుంది. అవును ఎలక్ట్రానిక్ మీడియా రిపోర్టింగ్ అంటే – స్టాప్ వాచ్ ఆన్ చేసుకుని చేసే పరుగు రేస్ వంటిదే. అందులో మరొక మాటకు చోటులేదు. కాని ఇక్కడ ఈ ‘రాతి తయారీ’ కథను కూడా కథకుడు మునిసురేష్ పిళ్లె ఇ-మీడియా రిపోర్టింగ్ స్పిరిట్ తోనే బిగి సడలకుండా పరుగులు పెట్టిస్తాడు. కథకు ఎంచుకున్న ఈ శైలివల్ల ‘పాజ్’ (విరామం) లేకుండా, కథకుడు ఒక ‘పైలెట్’లా తాను ముందుండి మనల్ని తనవెంట పరుగులు పెట్టిస్తూ లాక్కుపోతాడు. మళ్లీ మనల్ని వెనక్కి తిరిగి చూడనీకుండా తనతో లాక్కుపోవడం వరకు సరే; కథ చివర్న – అర్థంతరంగా మనల్ని వదిలివేయడం కూడా అంతే నిర్లక్ష్యంగా, అంతే బాధ్యతారాహిత్యంగా వదిలేస్తాడు. శిల్పరీత్యా ఇది కథనంలో రచయిత చూపించదలచుకున్న పొగరు (ప్రైడ్) అనడానికి వెరవనక్కర్లేదు. అంతేకాకుండా న్యూస్ రిపోర్టింగ్ లో పాలో అప్ బాధ్యతల పట్ల అస్సలు దాఖలుపడని ఇ-మీడియా ధోరణికి కూడా ఈ కథ ముగింపు తీరు ఒక ప్రతీకాత్మక అభివ్యక్తి. ఇది యువకథకులు కథనంలో తీసుకుంటున్న స్వేచ్ఛగా ప్రశంసించవలసిన సందర్భం. చెప్పాలనుకున్న విషయం అయిపోయింది అనుకొన్నప్పుడు, ఇంకా ఇక్కడ మన పనేం ఉంది అన్నట్టు కథకుడు సీన్ నుంచి నిష్ర్కమిస్తాడు.

సరే ‘అన్న’ రమేష్ లు రైతు ఇంటి ముందుకొచ్చారు –

‘‘అదొక చిన్న చుట్టు గుడిసె. ముందర తాటాకు కప్పిన చిన్న పందిరి ఉంది. ఇంటి గడపదగ్గరే నలుగురు ఆడవాళ్లు కూర్చుని ఉన్నారు. వారిలో మరీ వయసు మీరని ఓ ముసలమ్మ ఎండిపోయిన ఒళ్లు, శిథిలమైపోయిన గుడిలాగా ఉంది. అప్పటికే అలసిపోయినట్లుంది. స్పృహ తప్పిందేమో! మరో మహిళ పొదివి పట్టుకుని ఉంది. నిశ్శబ్దంలో క్రమం తప్పకుండా ఏడ్పు తాలూకు వెక్కిళ్లు, అప్పుడప్పుడూ, ‘‘నా బిడ్డ నా బిడ్డ’’ అంటూ గొణగడం… వినిపిస్తున్నాయి.

‘‘ఎస్సైని అడిగా, ఇంకా గంట పడుతుందిట’

అందుకే నాకు రమేష్ అంటే ప్రేమ. మన సమయం వృధా కానివ్వడు. సమాచారం మోసుకొచ్చేస్తుంటాడు. మిగిలిన ఛానల్స్ వాళ్లింకా రాలేదు. అక్కడి గుంపులో జొరబడి నలుగురిని మైక్ ముందు మాట్లాడిస్తే సరి. పెద్ద స్టోరీ అయిపోతుంది. ఇవాల్టికి అది చాలు. రేపు మళ్లీ ఫాలోఅప్ కు కొంత దాచుకోవాలి. దానికోసం అరగంట చాలు.

‘‘సరే పద!’’ పొలంవైపు నడిచాను. లైటర్ ఉందో లేదోనని జేబు తడుముకుంటూ.

ఎస్సై నోట్లో ఎప్పుడూ నిజం రాదు. శవం వచ్చేసరికి రెండు మూడు గంటలు దాటింది. మా సిగిరెట్టు ప్రేమ కూడా కొంత లాభం తెచ్చింది. తెలియకుండానే అయినా మేం వెళ్లింది ఆ చచ్చిన రైతు పొలంలోకే…

 

బీళ్లు పడ్డ పొలాలు, ఎండిన చెట్లు… సారీ మొక్కలు… ఛ… ఏమందాం… నారు. ఓ.కె.ఎండిన వరినారు.

‘‘అద్దిరింది. రోజూ తమ దరికి వచ్చి ఆశగా చూసి, ఆకాశానికేసి చూసి కాసేపు గడిపి వెళ్లే నేస్తం… దిగంతాలకు వెళ్లిపోయాడని ఈ ఎండిన వరికి, గుండె పగిలిన పొలానికి ఏం తెలుసు పాపం… అంటూ వాయిస్ ఓవర్ వేసి ఈ విజువల్స్ చూపించామంటే పేలిపోతుంది. కానివ్వమంటూ అన్నీ షూట్ చేయించాను.’’

తిరిగి ఊళ్లోకి వచ్చి అందరితో మాట్లాడాం. వినీ వినీ అరిగిపోయిన పాత రికార్డులాగా… అన్నీ మామూలు బాధలే. కరువు, అప్పులు, ఆకలి గట్రా గట్రా… కొత్తగా ప్రెజంట్ చేయడానికి మంచి పాయింటేం దొరకలేదు. అంతా పూర్తయి గోళ్లు గిల్లుకుంటూ కూర్చున్నప్పుడు… వచ్చింది పోలీసు జీపు. అందులోంచి అన్ని ఛానెళ్లవాళ్లూ బిలబిలమంటూ దండులా దిగి ఉరికారు. మా రమేష్ కు కొత్తగా చెప్పక్కర్లేదు.

దాని వెనుకే అంబులెన్సు.

పొద్దు గుంకడానికి ఇంకా కొంత వేళే ఉంది. ఆ లోగిలి మాత్రం వీడియో లైట్లతో మధ్యాహ్నంలా వెలుగుతోంది.

ఊళ్లో వాళ్లు ఒకరిద్దరు చేయందిస్తే పోలీసులు బాడీ తీసుకెళ్లి పందిట్లో పడుకోబెట్టారు.

‘‘అమ్మా బిడ్డొచ్చినాడు…’’

ఆ ముసలమ్మను పొదివి పట్టుకుని వున్న ఇంకో తల్లి మెల్లగా గొణగింది.

అంతసేపూ స్పృహలో లేనట్లుగా శవం పడి వున్న ఆ ముసలామె దిగ్గున లేచింది. దిక్కులు బెదిరిపోయేట్టు ‘‘నాయనా బిడ్డా…’’ అని బొంగురుపోయిన గొంతుతో బిగ్గరగా అరచింది. దబ్బున కుప్పకూలిపోయింది. శోకం ఆమెను ఆకులా ఊపేస్తోంది.

గుడ్డలో చుట్టి ఉన్న కొడుకుని పాదాల దగ్గర్నించి తలవరకు తడిమి తడిమి చూసుకుంటోంది. పొగిలి పొగిలి ఏడుస్తోంది. బుగ్గలు పుణికి పుణికి ముద్దుపెట్టుకుంటోంది.

మనవాళ్లంతా జూమ్ లెన్స్ ల్లోంచి ఏడుపు అద్భుతంగా వుండేలా విజువల్స్ ను బంధిస్తున్నారు. డిటిఎస్ వంటి ఎఫెక్టులకోసం కొందరు కాలర్ మైకులు కూడా తెచ్చారు. కానీ, ఆవిడకు దాన్ని అమర్చేంత వ్యవధి వారికి చిక్కనట్టుంది. పాపం! మామూలు మైకులు పట్టుకుని కుస్తీలు మొదలెడుతున్నారు.

మావాళ్లపని కత్తిమీద సాము. నిజానికి ఆ మైకు పట్టుకుని అడిగే పని నాదే! కానీ మా వాడు సమర్ధుడు కాబట్టి. ఓ గ్రామస్థుడి చేతికి మైక్ ఇచ్చి, ఆ గుంపులోకి నెట్టాడు. ఓవైపు ఆవిడ పొర్లి పొర్లి ఏడుస్తుంటే… రాష్ట్ర ప్రజానీకానికంతటికీ మెరుగైన సమాచారాన్ని అందించడం కోసం ఇంత కష్టపడాల్సి రావడం మాకు కత్తిమీద సాము కాక మరేంటి. ఒక్కొక్కరూ శరపరంపరగా ప్రశ్నలు గుప్పిస్తున్నారు.

‘‘అమ్మా చెప్పండి మీ కొడుకు ఆత్మహత్యకు కారణం ఏమనుకుంటున్నారు?’’

‘‘ప్రభుత్వం ఉచిత విద్యుత్తు, రుణాలు ప్రకటించినా ఆత్మహత్య చేసుకున్నాడంటే… ఈ హామీలు రైతులకు సంతృప్తిగా లేనట్లేనా అమ్మ…?’’

‘‘మీ కుటుంబం దీనస్థితిలో ఉందని సాయం అడిగితే, ప్రభుత్వ పరంగా ఆదుకోవడానికి మీ ఎమ్మెల్యే తిరస్కరించాడా?’’

‘‘గత ప్రభుత్వ నిర్వాకం వల్లే మీ కుటుంబం ఆర్ధికంగా చితికిపోయి ఇప్పుడు ఆత్మహత్యకు దారి తీసిందా…’’

‘‘ఈ పల్లెలో భూస్వాములు, పెత్తందార్లు మీబోటి పెదరైతులు బతకనీయకుండా దోచుకుతినేస్తున్నారా… చెప్పమ్మా చెప్పు?’’ ఒకటే గొంతులో ఆవేశం వెల్లువెత్తేస్తోంది.

మా వాళ్లు… ఎవడికి ఎలాంటి సమాధానం కావాలో దానికి తగ్గట్లుగా ప్రశ్నల్ని తయారుచేసుకుని ఆ తల్లిమీదికి వదులుతున్నారు.

ఆమెకు మాత్రం – ఈ లోకం పట్టినట్లు లేదు. ఏడ్చి ఏడ్చి అలాగే ఊపిరి వదిలేయాలన్నట్లుగా, ఊపిరి వదిలేసే వరకూ అలాగే ఏడుస్తూ వుండాలన్నట్లుగా… శృతి పెంచుతూ, తగ్గిస్తూ ఏడుస్తోంది.

నేను టౌనుకు వెళ్లగానే ఎలాంటి స్టోరీలు ఇవ్వాలో అప్పటికో ప్లాన్ చేసేసుకుంటున్నాను. ఇక ఇక్కడేం మిగల్లేదు. ఏదైనా జరుగుతుందేమోనని వేచి ఉన్నాం అంతే! అంటే, రైతు తరపున ఎవరైనా ఆవేశంగా దేన్నయినా ప్రభుత్వ ఆస్తుల్ని తగలబెట్టడం వంటివి, కనీసం ఏమ్మార్వో వస్తే జీపును అడ్డగించి కొంత గొడవచేసినా చాలు. అలాంటివి జరిగితేనే మజా! వేచి వుండక తప్పదు మరి! కాస్త దూరంగా వెళ్లి మళ్లీ సిగరెట్ అంటించాను. లైటర్ ఆపేలోగా పెదవుల మధ్యనున్న సిగరెట్ ఒక్క ఉదుటున జారి కిందపడిపోయింది. నివ్వెరపోయి అటు పరుగెత్తాను.

ఆమె బిడ్డమీద పడి ఏడుస్తోంటే మనవాళ్లు మైకులన్నీ తేనెతుట్టలా మొహాన్ని కప్పేసి ఉన్నాయి. అంతవరకు నేను సిగరెట్ కి వెళ్లేముందు చూసింది. అప్పటివరకు ఎంతో బలహీనంగా – ఇప్పుడే చనిపోతుందేమో అనిపించేలా వున్న ఆమె – ఒక్కసారిగా పూనకం వచ్చిన దానిలా లేచి నిల్చుంది. ఎప్ప.డో జారిపోయిన పైటను లాగి భుజం మీద నుంచి బిగదీసి బొడ్లో దోపింది. చెమటకారి జిడ్డోడుతున్న మొహానికి అతుక్కుపోయి ఉన్న జుట్టు పాయల్ని కొంచెం వెనక్కి నెట్టింది.

‘‘ముండమోపి ఎదవల్లారా…!’’

ఒక్కసారిగా చేతుల్నిండా జవురుకున్న మట్టిని మైకులు పట్టుకున్న వాళ్ల మీదకి విసిరికొట్టింది.

‘‘నా బిడ్డ సచ్చిపోయినాడురా. మీయమ్మ కడుపులు మాడ. నా బిడ్ద సచ్చిపోయినాడురా… నన్ను ఏడవనీయ్యండిరా…! నా సావు నన్ను సావనియ్యండిరా! మీకేం పొయ్యేకాలం వొచ్చిందిరా మాదత్యోదుల్లారా… ఈ గొట్టాలన్నీ నా నోట్లో తెచ్చి పెడ్తారేందిరా… కనీసం నా బిడ్డ మీద ఈ కడపటి రోజైనా కళ్ల నిండా కడవడు నీళ్లు గార్చి ఏడవనియ్యరేందిరా ముదనష్టపు ఎదవల్లారా… మీ పెళ్లాలు ముండమొయ్యా…’’

అరుస్తూ… అరుస్తూ… అరుస్తూ… అలాగే ఒరిగిపోయింది.

స్పృహ లేదు.

ఒకామె పరుగున వెళ్లి దొసిలితో నీళ్లు తెచ్చి మొహాన కొట్టింది.

‘‘బిడ్డా… బిడ్డా….’’ అని గొణుగుతోంది.

మావాళ్ల చేతుల్లో మైకులు జారిపోయాయి. ఎవరో ఒక పెద్దమనిషి వచ్చి కసురుకున్నాడు. కెమెరాల కళ్లన్నీ పక్కకు మళ్లాయి. కొన్ని రెప్పలు మూశాయి.

తిడితే తిట్టారు గాని ఒకింత తీరిక దొరికిందిలెమ్మని మనవాళ్లు ఎడంగా వచ్చి సేదతీరుతూ కెమేరాలు వేళ్లాడేస్కుని భుజం గూళ్లు ఒత్తుకుంటున్నారు.

అంతలో ఒక్కసారిగా మళ్లీ కలకలం.

ఓ గుంపు కుర్రాళ్లు మా వాళ్ల వెంటబడి తరుముతున్నారు. రాళ్లుచ్చుకుని కొడుతున్నారు. అంతా పరుగులు. రమేష్ కోసం నా కళ్లు వెదికాయి. కనపళ్లేదు. పారిపోయాడా? అయిపోయాడా? దూరంగా ఉండటం మూలాన నేను కూడా తరమాల్సిన మనిషినేనని వాళ్లు గుర్తించలేదు.

‘‘సంపుతాం కొడకల్లారా’’, ఏదో ఒక గొంతు గుంపును మరింత రెచ్చగొడుతోంది. అంతలో గుంపులోకి ఎస్సై జొరబడ్డాడు. ‘‘ఇంకేం లేదులెండి సార్ – అంతా అయిపోయింది కదా సార్. పదండి సార్’’ సర్దుతూ, తీస్కొచ్చి అందర్నీ హడావుడిగా జీపెక్కించేశాడు బలవంతంగా.

విషయంలో పడి దాన్ని చెబుతున్న కథనంలో పడి ఏకరీతిని ఒకే ‘రిథమ్’లో మిళితం కావడం ఈ కథకున్న విలక్షణత. అతి కొద్ది కథలకే ఇటువంటి – మేలైన పొందిక అమరుతుంది. కథ ముగింపు దగ్గరకు వచ్చాం.

‘అన్న’ – రమేష్ మోటార్ సైకిల్ మీద ఆ ఊరినుంచి తిరుగు ప్రయాణంలో ఉన్నారు.

దారిలో వారి సంభాషణ –

‘‘అవునా?’’

స్వరంలో దిగ్ర్బమ, భయం గమనించేశాడు. మోటారు సైకిలు నడుపుతూనే…

‘‘అవునన్నా ! మరి కుర్రాళ్లకు అంత కోపమూ ఎందుకొచ్చిందనుకున్నావ్? నేను కొంచెం ముందే పసిగట్టా! అందుకే పరుగున వెళ్లి పక్కనున్న మేడ ఎక్కేశా! మనకేం, మంచి పవర్ ఫుల్ జూమ్ వుందిగా!’’

ఏం చెప్తున్నాడో వినబడట్లేదు. కళ్లముందు శూన్యంగా వుంది. గుండె అంతా చీకటైపోయింది. అది మామూల్దికాదు. క్షణంలో తేరుకుంది. సెల్ అందుకున్నాను చేరవేయడానికి.

‘‘అయ్యయ్యో…’’

‘‘ఇంకా నీలో ఇలాంటివి మిగిలే వున్నాయేంట్రా…’’ వెటకారమాడాను.

‘‘సర్లే చెప్పు’’, గొంతులో తేడా వచ్చింది.

‘‘ముందు బ్రేకింగ్ న్యూస్ లో ఇచ్చేయ్. వేరే ఛానల్స్ వాళ్లెవ్వరూ లేరు. చెప్పాగా అందర్నీ తరిమేశారు. విజువల్స్ మనకే స్కోరు. ఇంకెవరికీ దొరకవ్ కూడా! ఇంకో అయిదు నిమిషాల్లో అక్కడుంటాయ్’’

‘‘సరే సరే…’’ముక్తసరిగా అంటున్నాడు.

‘‘న్యూస్ బ్రేక్ వరకు ఆగకుండా రాగానే వేసేయ్! రాష్ట్రమంతా ఇవాళ మన ఘనకార్యంతో అట్టుడికిపోవాలి…’’

‘‘రాస్కో – కొడుకు వెనుకే తల్లి… తరగని శోకంతో తిరిగిరాని లోకాలకు… అని వేశామే అనుకో…’’

అంతే ! రచయిత కథను – కరెంటుపోయి ఆగిపోయిన టి.వి.లా  ఇక్కడ ఆపేస్తాడు.

ఇది మునిసురేష్ పిళ్లై కథ ‘రాతి తయారీ’.

కథలోని – కెమేరా గొట్టాలు ముసలమ్మ ముఖంమ్మీద పెట్టి ఆమె.ను వాళ్లు అడిగే ప్రశ్నలు వంటి సన్నివేశాలు మనం ప్రతిరోజూ చూసేవే. అందివచ్చిన ప్రతి సందర్భంలోనూ ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ప్రజాభిప్రాయం కూడకట్టాలని ఇ-మీడియా ఇంతగా క్రింద మీద అవుతున్నా – కనీసం వాటి పరిష్కరాల కోసం స్థానికంగా అయినా ఎందుకు ప్రజా ఉద్యమాలు రావడం లేదు? ప్రతి సమస్యకు ప్రభుత్వాల వైఫల్యమంటూ దానికి ఒక వ్యవస్థీకృత రూపం ఇచ్చే ప్రయత్నం మీడియా చేస్తున్నదే తప్ప స్వచ్ఛందంగా ప్రజలు కూడా అంతే స్ఫూర్తితో దానిని తమ స్వవిషయంగా తీసుకోవడం లేదా? వారు అలా తీసుకోనప్పుడు మీడియా ఏ ప్రయోజనాల్ని ఆశించి ఇంత కసరత్తు చేస్తున్నట్లు? ఈ ప్రశ్న వద్ద సమాధానం రెండుగా చీలిపోతున్నది – అంటే రెండు అభిప్రాయాలు చలామణిలో ఉన్నాయి. ఒకటి – అస్సలు ‘మీడియా వాచ్’ అనేది ఒకటి ఉంటే సమాజానికి దాని ప్రయోజనం ఎంతో కొంత శాతం ఉంటూనే ఉంటుంది అనేది ఒకటి. రెండవది – ఆయా ఛానళ్ల యాజమాన్యాలు ఇతర రంగాల్లో పెట్టే పెట్టుబడులకు ఇ-మీడియా ఆధిపత్యం అదనపు ప్రయోజనకరమవుతున్నది. కనుక ఈ తరహా రిపోర్టింగులో ఉన్నది కేవలం వాస్తవాల నివేదన తప్ప మరింకేమీ కాదు, అనే నిర్ధారణకు రాలేని పరిస్థితి నెలకొని ఉన్నది. ఈ రెండు అభిప్రాయాలు సత్యదూరాలు అని అనలేము.

సరే ఈ చర్చ అలా ఉంచితే, ఛానళ్ల మధ్య పోటీ పేరుతో సాగుతున్న ఈ మానవీయ లక్షణాల హననం మాటేమిటి? ముఖ్యంగా సృజన రంగంలో క్రియా శీలంగా ఉన్నవారి మాటేమిటి? మనిషి తయారుచేసుకున్న టెక్నాలజీ ఆ మనిషినే ఉరుకులు పరుగులు పెట్టిస్తుంటే దీనికి ముగింపు ఎక్కడ? ఇటువంటి రిపోర్టింగ్ ఏ విలువలను, సున్నితభావాలను (సెన్సిబిలిటీ) మనుష్యుల్లో నాలుగు కాలాలపాటు నిలపగలుగుతాయి? అన్నీ ప్రశ్నలే! చివరిగా ఏ ప్రయోజనం ఆశించి రచయిత ఈ కథను రాశాడు? అనే ప్రశ్నకు సమాధానం కథకు కథకుడు ఉంచిన పేరే అని చెప్పవలసి ఉంటుంది! అది ఏ మీడియా అయినా విలేకరికి ఉండవలసిన ప్రాధమిక అర్హత – మానవీయ దృక్ఫథం.

ముసలమ్మ కూడా చనిపోయింది అని రమేష్ చెప్పినప్పుడు ‘అన్న’ అంటాడు కళ్లముందు శూన్యంగా ఉంది.

‘గుండె అంతా చీకటైపోయింది’ అని, కాని వెంటనే

‘అది మామూల్ది కాదు’ అంటాడు, అంటే –

(అది ‘రాతి తయారీ’ అన్నమాట)

(అది) క్షణాల్లో తేరుకుంది.

సెల్ అందుకున్నాను. చేరవేయడానికి.

కథంతా రచయిత ఒక ‘రింగ్ సైడ్ వ్యూ’ అన్నట్టుగా చెప్పి కథ మీద తన వ్యాఖ్యను మరీ సింపుల్ గా టైటిల్ ద్వారా చెప్పి, మొదటి కథతోనే తన కథ ‘క్రాఫ్ట్’కు విమర్శకుల ఆమోదం సాధించుకున్న మునిసురేష్ పిళ్లైకి అభినందనలు.

..  చోరగుడి జాన్సన్

ఎడిటర్

ముప్ఫయ్యేళ్ల జర్నలిజం, రచన రంగాల్లో అనుభవం. ప్రచురణల రంగంలో సుదీర్ఘ అనుభవం. కథలు, కవితలు, వ్యాసాల ఎంపిక, వెబ్ మేగజైన్ సంపాదకత్వ బాధ్యతలు.

Previous Post

భ్రమాలంకారం

Next Post

నన్ను నేనే కొట్టుకున్న చెంపదెబ్బ!

Next Post
నన్ను నేనే కొట్టుకున్న చెంపదెబ్బ!

నన్ను నేనే కొట్టుకున్న చెంపదెబ్బ!

Discussion about this post

ఈ సంచికలో…

  • ‘కాల్ యూ లేటర్’
  • అప్పులు పుట్టు తావు…
  • నన్ను నేనే కొట్టుకున్న చెంపదెబ్బ!
  • ‘న్యూస్ ఛానల్’ గొట్టాల మీద మట్టికొట్టిన కథ
  • భ్రమాలంకారం
  • వెంటవచ్చునది
  • అనాది – అనంతం
  • ఆ రకంగా ఒక్కటయ్యారు
  • బదిలీ
  • చమించేయండి

అభిప్రాయాలు

    ఈ నెల పత్రిక

    కేటగిరీలు

    • కథలు
    • కవితలు
    • పద్యాలు
    • వ్యాసాలు
    • సమీక్షలు

    ఇవి చూడండి

    • పాఠకులకు సూచనలు
    • మా గురించి..
    • రచయితలకు సూచనలు
    • సంప్రదించండి

    నిష్పాక్షిక వార్తా విశ్లేషణల కోసం..

    Developed by : www.10gminds.com

    No Result
    View All Result
    • హోం
    • కథ
      • కథలు
      • అనువాద కథలు
    • కవిత
      • పద్యాలు
      • కవితలు
    • నవల
      • సీరియల్స్
      • నవలలు
    • వ్యాసం
      • వ్యాసాలు
      • సమీక్షలు
    • సృజన పథం
      • కథలు
      • కవితలు
    • వీడియోలు
    • సంచికలు
    • రచయితలు
    • పత్రికలు
      • తెలుగువెలుగు
      • సారంగ పక్షపత్రిక
      • ఈమాట
      • సంచిక
      • గోదావరి
      • గో తెలుగు
      • సహరి

    Developed by : www.10gminds.com