(ఒక పాప అమాయకంగా కోనేటి ఒడ్డున కూర్చుని ఉంటుంది.. ఇంకా తెరుచుకోని గుడి తలుపుల వైపు చూస్తూ ఉంటుంది)
- పా పా..అక్కడేం చేస్తున్నావ్? (అమ్మా నాన్న అన్నయ్యల వాయిస్ తో మూడు సార్లు పిలుపు)…అటు ఇటు చూస్తుంది..
ఎవరూ కనిపించకపోవడంతో అయోమయంతో కూడిన మౌనం..
- (ఇంతలో చిరునవ్వుతో) ఒక వ్యక్తి పాప దగ్గరికి వస్తాడు.. నీతో మాట్లాడను..స్ట్రేంజర్ (అంటూ పాప దూరంగా వెళుతుంది.. ..
దాంతో ఆ వ్యక్తి కొంచెం దూరంగా వెళ్లి కూర్చుంటాడు..)
- కొంచెం సేపు తర్వాత అతనివైపే పదే పదే చూసి.. పాప తనంత తాను దగ్గరికి వస్తుంది
స్ట్రేంజర్ దగ్గరికి ఎందుకొచ్చావు?( ఆ వ్యక్తి చిరునవ్వుతో ప్రశ్నిస్తాడు)
నిన్ను మళ్లీ మళ్లీ చూస్తే అచ్చం మా మామ లాగే ఉన్నావు..(పాప తేరిపార చూస్తూ బదులిస్తుంది)
- పట్టి చూస్తేనే కదా..తెలిసేది.( నవ్వుతూ తన పక్కన చోటు చూపుతూ అంతర్గర్భితంగా చెబుతాడు)
- అవును …ఇక్కడికి ఒక్కదానివే ఎందుకొచ్చావు..? (భృకుటి ముడివేసి పాపను ప్రశ్నిస్తాడు)
రోజూ వస్తాను.. రాత్రి హోం వర్క్ చేయలేదు… లెక్కలు అర్థం కావడం లేదు..అమ్మ తిట్టింది.. కోపం వచ్చింది.. దేవుడిని ఒకసారి
చూద్దామని తొందరగా వచ్చేశా.. అంతే.. ( తెరుచుకోని గుడి తలుపుల వైపు చూస్తూ పాప కొంచెం దీనంగా చెబుతుంది)
- అవును.. నీ పేరేంటి? నిన్ను ఇక్కడ ఎప్పుడూ చూడలేదే..(పాప ఆసక్తిగా అడుగుతుంది)
వీరవెంకట గోపాల శ్రీనివాస.. సత్య.. శివ.. రామ.. నాగ సుబ్రహ్మణ్య..( కొద్దిగా కళ్లు మూసుకుని పాపకు చెబుతూ ఉంటాడు..)
- అబ్బో అంత పేరే… నాకు వద్దులే.. ఆపేయ్… గుర్తుండదు( మధ్యలోనే కట్ చేస్తుంది పాప)
అచ్చం మా మామ లాగా ఉన్నావుగా.. మామా అని పిలవవచ్చా…( సమాధానం కోసం ఎదురుచూస్తున్నట్లుగా అడుగుతుంది)
- మామ..(నొక్కి పలుకుతూ). నవీన నామకరణం.. మరో కొత్త పేరు..గమ్మత్తైన పేరు ( తనలో తాను అనుకుంటూ ఉంటాడు..
ఇంతలో కేశవ..మాధవ..నారాయణ.గోవింద ..మధుసూదన.. వేల వేల పేర్లు .బ్యాక్ గ్రౌండ్ లో అతనికి వినిపిస్తూ ఉంటాయి. )
ఏమిటీ చెప్పవే..( పాప పట్టి కుదిపి అడుగుతుంది)
ఓ చాలా బాగుంది.. బంగారంలా పిలు.. నీ ఇష్టం.. ఎలా కావాలనుకుంటే అలా పిలు ( తన్మయత్వంతో చెబుతాడతడు)
- మీ మామ అంటే నీకంత ఇష్టమా..? (అతడు ప్రశ్నిస్తాడు…ఆమె కళ్లల్లోకి చూస్తాడు)
- హా…. (సాగదీస్తుంది) నన్ను చిన్నపుడు ఎత్తుకునేవాడు.. తాయిలాలు కొనిపెట్టేవాడు.. ఆడించేవాడు..ఇప్పటికీ మా మామ వస్తే పండగే…( ఆనంద డోలికల్లో తేలియాడిన మధురస్మృతులను గుర్తు చేసుకుంటూ ఉత్సాహంగా చెబుతుందా పాప)
- ఇంతకీ నువ్వేం చేస్తుంటావు.. ( యథాలాపంగా రొటీన్ గా అడుగుతుంది పాప )
డాక్టర్ గా పనిచేస్తుంటా ( బదులిచ్చాడతను)
- చాలా మంది డాక్టర్లు ఉంటారుగా.. ఏ డాక్టర్ .. ? స్టెత స్కోప్ ఏది..?
గుడి కదా.. అవసరాన్ని బట్టి మన అవతారం.. ఐమీన్ వేషభాషలు (( పైన వేసిన శాలువా సవరించుకొంటూ చెబుతాడు.. వచ్చి
వారతిని జొచ్చి సోమకుని తెచ్చిత వేగమే.. మెచ్చి విధాతకు దశావతారాల బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సన్నగా వినవస్తూ ఉంటుంది.)
డాక్టర్ గా ఏమేం చేస్తుంటావ్ ( పాప సాగదీసి అడుగుతుంది)
- పురుడు పోస్తాను.. వైద్యం చేస్తాను.. ప్రాణం కాపాడతాను.. నాచేతుల్లో ప్రాణాలూ పోతుంటాయి (గంభీరంగా కళ్లజోడు తీస్తాడు.. నీటి పొర అలుముకుని ఉంటుంది)
- అరెరే ఎందుకు ఏడుస్తున్నావు..? (పాప కళ్లు తుడుస్తుంది)
- అయినా నల్లకళ్లజోడు .. ఎందుకు పెట్టుకున్నావు.. అంతా ఒకేలా కనిపిస్తుంది..కదా..
- అంతా ఒకేలా కనిపించాలనే.. (చమత్కారంగా బదులిస్తాడు)
ఓహో ఫ్యాషనా… (పాప విరగబడి నవ్వుతుంది)
- తింగరి మాలోకంలా ఉన్నావ్.. నీ కాళ్లకు ఒక సాక్సు తిరగేసి వేసుకున్నావే.. (కాళ్లవైపు చూస్తూ వెటకరిస్తుంది పాప)
నువ్వేమో పిలిస్తే రాలేదు.. నీ దగ్గరికి వచ్చే కంగారులో చూసుకోకుండా వేసుకుని వచ్చేశా (సిరికింజెప్పడు.. ధ్వనిస్తూ ఉంటుంది బ్యాక్ గ్రౌండ్)
మా అమ్మ, అన్నయ్య, నాన్న పిలిచారనుకున్నాను.. ( పాప అర్ధోక్తిలో ఆగిపోతుంది)
నేనే పిలిచాను.. దూరం నుంచి.. నువ్వు ఇంటిలో వాళ్ల గురించే ఆలోచిస్తున్నావు కదా.. అలా వినిపించి ఉంటుంది( అతడు జవాబుగా సర్ది చెబుతాడు)
- మా మమ్మీ సాక్సు తిరగేసి వేసుకుంటే తిడుతుంది తెలుసా.. మార్చి వేసుకునే వరకూ తిడుతూనే ఉంటుంది.. (పాప ఫిర్యాదు చేస్తుంది..)
- అతని కాళ్లకు వేసిన సాక్సు తీసి మళ్లీ వేస్తుంది పాప (పాప సాక్స్ సర్దుతుంటే.. జ్నానానందమయం దేవం.. నిర్మల స్ఫటికాకృతిం.. అంటూ సున్నితంగా తలమీద చేయి వేసి మంత్రం చదువుతాడతను.. ఏదో అంటున్నావు… ఏమిటది (పాప తలపైకెత్తి అడుగుతుంది )
..నువ్వు నాకు హెల్ప్ చేస్తున్నావుగా.. నీకు మంచి జరగాలని…ఒక మంత్రం .. చెబుతున్నా ఉపకారికి ఉపకారం అన్నమాట (అతను సరదాగా బదులిస్తాడు).
ఓహో నేను ‘మమ’ అనాలన్నమాట.. ( పాప ఛలోక్తి విసురుతుంది)
నీకెలా తెలుసు.. (అతను తల ఊపుతూ అడుగుతాడు)
మా మామ పెళ్లి లో చూశాను. అయ్యోరు.. ఏదేదో చదివేసి.. మమ అని మామ చేత. అత్త చేత అనిపించేవారు.. అలాగైతే ఆ మంత్రాలన్నీ వాళ్లు చదివేసినట్లే నంట ( పాప తనకు తెలిసిన విషయాన్ని గొప్ప జ్ణానిలా గర్వంగా చెబుతుంది)
- ఈసారి మార్చి వేసుకోకు..(సాక్సుల నుంచి చేయి తీస్తూ గద్దించినట్లు చెబుతుంది)
సాక్సు మారితే సర్దడానికి నువ్వున్నావుగా (ఆటపట్టిస్తూ అంటాడతను)
- నేనెందుకు మారుస్తాను.. ఎవరిది వాళ్లే మార్చుకోవాలి.. (కొంచెం కోపంగా, విసుగుగా చెబుతుంది పాప)
- ఓహో ఎవరి పని వాళ్లే చేసుకోవాలన్నమాట.. (సాలోచనగా చెబుతాడతడు)
అవును.. అమ్మ ఎప్పుడూ అదే చెబుతుంది (పాప బదులిస్తుంది)
..మరి దేవుడి దగ్గరకు ఎందుకొచ్చావు.. నీ పని నువ్వు చేసుకోవచ్చుగా.. (పాప వైపు సూటిగా చూస్తూ అతడు ప్రశ్నిస్తాడు)
దేవుడిని ఒకటి అడుగుదామని ..వచ్చా (చెప్పాలా? వద్దా అన్నట్లు సంశయంగా మధ్యలో ఆగిపోతుంది పాప)
- నువ్వు ఇక్కడకు ఎందుకొచ్చావు.. ఎప్పుడూ ఇక్కడ చూడలేదు.. (మరోసారి ఎదురు ప్రశ్నిస్తుంది)
ఇంతలో పెద్దగా. గంటలు.. వినిపిస్తాయి… అతనికి మాత్రమే వినిపించేలా భజన… గోవిందా.. గోవిందా.. అంటూ వేల గొంతులు )
విచలితంగా.. దీర్ఘశ్వాస తీసుకుంటాడు..
మనోబుద్ద్యహంకార చిత్తాని నాహం… (సన్నగా చదువుతుంటాడు)
ఏమిటి.. ఏదో చదువుతున్నావు.. (పాప అతని పెదాల వైపు చూస్తూ అడుగుతుంది)
భజన.. గంటలు.. నీకు వినిపించడం లేదా.. (కళ్లు తెరిచి అడుగుతాడతను)
గుడి తెరిచారు.. గంటలు వినిపిస్తున్నాయి.. భజన లేదు.. (చెబుతుందా పాప)
ఓహో నావి పెద్ద చెవులులే.. (అతను సంజాయిషీ ఇస్తున్నట్లుగా చెబుతాడు)
ఏనుగు చెవులన్నమాట.. (పాప వెటకరిస్తుంది..)
మరి మంత్రం ఎందుకు చదువుతున్నావు.. (మరో ప్రశ్న వేస్తుంది)
నన్ను నేను సరిచేసుకుంటున్నాను లే.. నీకు వినిపించని, నాకు మాత్రమే వినిపించే సౌండ్ నుంచి నన్ను నేను తమాయించుకోవాలిగా.. (సర్దుకుని కూర్చుంటూ చెబుతాడు)
ఎవడ్రా అక్కడ కోనేరు దగ్గర.. చెత్త వేస్తున్నారా.. (దూరం నుంచి గంభీరంగా పెద్ద అరుపు)
తాతా.. నేనున్నాను (పాప గట్టిగా అరచి చెప్పింది)
సరే జాగ్రత్త… (అట్నుంచి సమాధానం)
నీకు కోపం వచ్చిందా.. ఏమీ అనుకోకు.. (పాప సముదాయింపుగా అడిగింది..)
నవ్వాడు.. తన పని తాను చేస్తుటే కోపం ఎందుకు? (అతడు బదులిచ్చాడు)
నువ్వు డాక్టర్ వి అని తెలియక తిట్టాడుగా (పాప తెలివిగా ప్రశ్నించింది)
నువ్వు మామా అని నీ భాషలో పిలిచావు.. అతను ఎవడ్రా అని అతని వ్రుత్తిలో పిలిచాడు..నాకు రెండూ ఒకటిగానే వినిపించాయి.. ( బదులిచ్చాడతడు)
- నువ్వుభలే చిత్రంగా మాట్టాడతావు.. ఇంతకీ దేవుడు ఉన్నాడంటావా? (మధ్యలో ఆగి అతని సమాధానం కోసం ఎదురుచూస్తుంది)
ఊ…(దీర్ఘశ్వాసతో చెబుతాడు)
25 . మరి కనిపిస్తాడా?…. (పాప ఎదురు ప్రశ్న)
హా.. (మరోసారి శ్వాస తీసుకుంటూ చెబుతాడు)
గుడిలో విగ్రహంలా కాదు.. నిజ్జంగా ..నిజమైన దేవుడు… (కొంచెం నిలదీసి అడుగుతుంది)
ఎలా కనిపించాలి…?. ఆ గుడిలో శంఖం చక్రం.. పెట్టారు.. ఈ గుడిలో బాణం పెట్టారు.. ఇంకో గుడిలో వేణువు పెట్టారు.. ఎలా కనిపించాలి.. నువ్వు గుర్తు పట్టలేవు.( తేలిగ్గా తేల్చేస్తాడతను)
- నేను గుర్తు పట్టేలా కనిపించాలి.. (తన మనసులోని కోరికను బయటపెడుతుంది)
సరే లే.. ( హామీ ఇస్తున్నట్లు గా భరోసా గా చెబుతాడు)
మరి మాట్లాడతాడా? నాకు అర్థమవుతుందా?( తనలోని మరింత ఎక్కువైన ఆసక్తిని ప్రదర్శిస్తుంది పాప)
హా.. ప్రపంచంలో చాలా బాషలున్నాయి కదా.. యూనివర్శల్ లాంగ్వేజ్ లో మాట్లాడతాడు. ( నవ్వి చెబుతాడు )
- రెండు చేతులతో చెవులు మూసుకో .. ( ఆజ్ఞాపిస్తాడతను)
ఏం వినిపిస్తోంది ( అడుగుతాడు)
లబ్ డబ్.. లబ్ డబ్.. అది గుండె చప్పుడు.. ( పాప చెబుతుంది)
ఎలా వస్తోంది… ఎక్కడనుంచి వస్తోంది..( అడుగుతాడతను)
- నాకెలా తెలుసు..( విసుగుగా చెబుతుంది)
చదువుకుంటే తెలుస్తుంది.. లోపల్లోపల కు వెళ్లి వెదికితే అర్థమవుతుంది..( చెబుతాడతను)
- నువ్వు విచిత్రం పట్టినోడిలా మాటాడుతున్నావు… నాకు పజిల్ .. అర్థం కాని ప్రశ్న అది…
(పాప తన అశక్తతను వెల్లడిస్తుంది)
- అర్థం కాని ప్రశ్న .. వెదుకులాటలోనే దేవుడున్నాడు..
ఏమిటో..నీ మాటలు నాకు అర్థం కావడం లేదు.. (పెదవి విరస్తుంది పాప)
అయినా నువ్వు .. గొప్పోడిలా కనిపిస్తున్నావు .. ఒప్పేసుకుంటున్నాను.. ( చేతులెత్తేస్తుంది పాప)
అలా ఒప్పేసుకుంటే నీకు ఆన్సర్ ఎలా దొరుకుతుంది..శోధించి సాధించాలి.. ఏప్లస్ బీ హోల్ స్వేర్.. ( ఏస్క్ీవరే ప్లస్ బీ స్కవేర్
ప్లస్ టూ ఏబీ.. ) అంటే అంతా కలిపేసి ఉన్న దానిని విడదీసి చూ్స్తే అర్థమైపోతుందన్నమాట.. ( అతడు ఈక్వేషన్ చెబుతాడు)
హెచ్ టూ ఓ లాగా.. ( తాను కూడా జత కలుపుతుంది పాప)
అవును.. ఏదైనా అంతే.. పెద్ద కూరగాయలను చిన్నచిన్మముక్కలు చేసి ఉడికిస్తే అరిగిపోతుంది.. కూరగాయను తినలేం కదా..
అంతే లెక్కలైనా.. విడదీసేస్తే సరి.. ( సింపుల్ లాజిక్ చెబుతాడతను)
నాకు అర్తం కాకపోతే అమ్మనో.. టీచర్ నో అడుగుతాను… నీలా కాకుండా వాళ్లు అర్తమయ్యేలా చెబుతారు.. ( పాప అతడిని గేలి చేస్తుంది). నవ్వుతాడతను..
గుడ్ .. వాళ్లు చెప్పింది ఫాలో అయిపో ( పాపకు అర్థమయ్యేలా చెప్పలేకపోయిన తన ఓటమిని అంగీకరిస్తాడు)
వాళ్లు చెప్పింది వింటే గొప్పదాన్ని అవుతానా..? (పాప అనుమానంగా అడుగుతుంది)
హా.. ( సింగిల్ మాటలో చెప్పేస్తాడతను)
- అంటే నీలాగా.?.(సందేహంతో రెట్టించి అడుగుతుంది)
)? హా..నాలాగా.. నీలాగా.. నీలాగా .. నాలాగా..(తిరగేసి రెండు సార్లు చెబుతాడు)
ఇద్దరూ నవ్వుకుంటారు..
32.మరి వెళదామా..
నాకు ఇక్కడే బాగుంది.. ఇంటికెళితే చెప్పకుండా వచ్చేశానని అమ్మ తిడుతుంది…( పాప గారాబంగా అంటుంది)
తిట్టదులే.. నువ్వు వెళ్లగానే కౌగిలించుకుని ముద్దులు పెడుతుంది… బంగారూ అంటూ నాన్న ఒడిలోకి తీసుకుంటాడు..
అన్నయ్య చాక్లెట్ ఇస్తాడు.. సరేనా ( నచ్చ చెబుతాడతను)
- నిజమా.. ప్రామిస్. (చేయి చాపుతుంది పాప)
ప్రామిస్.. ఇది గో ప్రసాదం.. ( చేతిలో ప్రసాదం పెడతాడు)
ఇందాకటి నుంచి కనిపించలేదే… ప్రసాదం..( అనుమానంగా చూస్తుంది)
నేను దాచాశానులే.. అవసరమైనప్పుడు ఇద్దామని.. చాలా సేపట్నుంచి మాట్టాడావు కదా.. నీకు ఆకలేస్తుంది అందుకే ఇచ్చా..
( పాప అనుమానాన్ని నివ్రుత్తి చేస్తాడు)
నిజమే నాకు ఆకలి వేస్తోంది..అమ్మ ఈ పాటికే టిఫిన్ చేసి ఉంటుంది.. ( ప్రసాదం తీసుకుంటూ..)
- నువ్వు కూడా మా ఇంటికి రా.. నాతో పాటు ఎవరైనా ఉంటే మా అమ్మ తిట్టదు.. నువ్వు ప్రసాదం పెట్టావుగా … నీకు మా
ఇంట్లో చాయ్ ఇస్తా.. ( పాప ఆఫర్ చేస్తుంది)
- సరే పద..
- ఏమో నీ మాట నమ్ముతున్నాను..అమ్మ తిట్ల నుంచి ..దేవుడే కాపాడాలి నన్ను… అన్నట్లు దేవుడు కాపాడతాడా..( మరో అనుమానం వ్యక్త ంచేస్తుంది)
- హా.. కచ్చితంగా.. ఇందాక నువ్వు ఆ పిల్లాడు కుక్కను కొడుతుంటే.. ఆపావు కదా.. అలాగే.. కాపాడతాడు..( పాపకు భరోసా ఇస్తాడు)
- అయితే దేవుడు కూడా మనలాగే అన్నమాట.. ( సంతోషంగా చెబుతుంది)
ఊ… .. ( అతడు ఉత్సాహం కనబరుస్తాడు)
పాప చేయి పట్టుకుని పైకి లేపి చేయి వదిలేస్తాడు..
- నా చేయి పట్టుకుని రా.. ( తన వెంట రాడేమోననే అనుమానంతో చేయి పట్టుకుంటుంది.. )
కొంచెం వెనకాల వస్తా.. ( అతడు)
ఏం..? ( పాప)
ఒక దమ్ము కొట్టి వస్తా.( అతడు)
. నువ్వు సిగరెట్ తాగుతావా..( ఆశ్చర్యంగా కళ్లు పెద్దవి చేస్తూ పాప)
- హా … (కుతూ హలంగా పాప వైపు చూస్తూ అతడు)
నాకు అసహ్యం.. ( పాప మొఖం చిట్టిస్తుంది)
- ఇందాక నేనంటే ఇష్టమన్నావు..( ఆట పట్టిస్తూ అతడు)
సిగరెట్ తాగేవాళ్లు అంటే నాకు చిరాకు…నువ్వు ప్రసాదం పెట్టావు… పలకరించావు.. మా మామలాగా కనిపించావు.. అందుకే
ఇష్టం..( పాప తనంటే ఎందుకు ఇష్టమో వివరించింది)
బాధ పడుతున్నాడేమో అని..ఒకసారి అతనిని తేరిపార చూసి మళ్లీ గోంతు సవరించింది..
మా అమ్మ గోరుముద్దలు పెడుతుంది.. గారాబం చేస్తుంది.. అప్పుడు ఇష్టం .. ఒక్కో్సారి తిడుతుంది చూడు .. అప్పుడు కోపం వస్తుంది..
అన్న నా బొమ్మలు చెడగొడతాడు అప్పుడు కోపం వస్తుంది.. నాతో ఆడుకుంటున్నప్పుడు ఇష్టం వేస్తుంది.. (పాప ఎక్స్ ప్లనేషన్ ఇచ్చింది)
- అంటే నేను చేసిన పనుల వల్లే ఇష్టం వచ్చింది.. మీ మామలాగా ఉండటం వల్ల దగ్గరికి వచ్చావు.. ఇప్పుడు సిగరెట్ అంటే దూరం పోతున్నావు.. అంటే నా పనులే చూస్తున్నావు అన్నమాట.. నా పనులను బట్టే నీకిష్టం అన్నమాట..
(అతడు దీర్ఘం తీస్తూ అడిగాడు)
- అవును… మా మామ అంటే నాకిష్టం.. మా మామ సిగరెట్ కాల్చడు.. అయినా నువ్వు సిగరెట్ కాల్చకూడదు.. అది తప్పు.. ( యాడ్ లో .. సౌండ్.. ) ఇద్దరి నవ్వులు
నువ్వు చెప్పినట్లు వింటాలే.. నెమ్మదిగా మానేస్తా.. ( పాపకు హామీ ఇచ్చాడతను)
- సరే నీవెనకాలే వస్తూ ఉంటా.. నువ్వు పద ( పాపకు సూచించాడు)
ఆగి సందేహంగా చూసింది..
నీ అంతట నువ్వు వచ్చావు.. నీ అంతట నువ్వే వెళ్లాలిగా. ( పాపకు బాధ్యతను గుర్తు చేశాడు)
భయం వేస్తోంది… ( ఎందుకో నెమ్మదిగా అంది)
నీ వెనకాల ఉంటాను సరేనా..( కూడా బయలు దేరుతూ చెప్పాడు)
నిజంగా వెనకాలే రావాలి..( భరోసా కోరింది)
- వెనక్కి తిరిగి తిరిగి చూస్తూ అతను వెనకాల వస్తుంటే.. ఇంటికి చేరుకుంటోంది..
అతను మెల్లగా అడుగులు వేస్తూన్నాడు ఆచితూచి.. నేలను చూసుకుంటూ..
అదేంటి.. అంత నెమ్మదిగా నడుస్తున్నావు.. ( తనను వదిలి వెళ్లిపోతాడేమోనని.. ఒక అడుగు వెనక్కి వేసి అడిగింది)
నేను కొంచె స్లో.. పాపా.. కాళ్లకింద పడి చీమ చితకా ..నలిగి పోతాయి కదా..( నర్మగర్భంగా బదులిచ్చాడు)
- చీమలను కూడా చూసుకుని నడుస్తావా..(పాప నవ్వులు )
అదే దేవుడైతే పెద్ద పెద్ద రాక్షసులను చంపేస్తాడు తెలుసా…( గొప్పగా చెప్పింది )
47 ఇంత సెన్సిటివ్ అయితే ఆపరేషన్లు ఎలా చేస్తావు.. రక్తం చూస్తే నాకే భయం..( పాప జాలిగా చూసింది)
అవసరమైనప్పుడు తప్పదుగా పాపా….( అతడు గంభీరంగా బదులిచ్చాడు.. యథాయథాహి ధర్మస్య .. బ్యాక్ గ్రౌండ్ లో మ్యూజిక్)
- ఇంటికి చేరింది పాప..
చెప్పా పెట్టకుండా ఎక్కడికి వెళ్లావే.. ఇంతసేపూ (నిలదీస్తూనే దగ్గరకు తీసుకుంది తల్లి )
గుడికి వెళ్లా.. అక్కడ మన మామ లాంటి మామ నాతో మాట్టాడాడు.. నాతోపాటు మన ఇంటికి కూడా వచ్చాడు..( అంటూ వెనక్కి తిరిగి చూస్తుంది పాప)
నథింగ్.. అక్కడెవరూ లేరు..
అయ్యో వెళ్లిపోయాడే.. ప్రామిస్ చేశాడు.. ( పాప బాధగా నొచ్చుకుంటుంది)
ఎవరూ లేరులే.. ( మమ్మీ సముదాయింపు..)
- అంకుల్ కి వీడియో కాల్..చేస్తుంది… పొలంలో మామ లిఫ్ట్ చేస్తాడు..
మామా… అచ్చం నీలాంటి మామే.. గుడి దగ్గర కనిపించాడు..( పాప ఆత్రుతగా చెప్పసాగింది..)
మన ఇంటికొచ్చి చాయ్ తాగుతానని ప్రామిస్ చేశాడు.. కానీ మాట తప్పాడు..( ఫిర్యాదు చేసింది పాప)
ఇదిగో నీకు టీ.. ( చాయ్ కప్పు చూపించింది పోనులో మామకు)
అట్నుంచి చప్పరించినట్లు సైగ..
సరే పాప.. నేను తాగేశానుగా…నువ్వు కూడా కానిచ్చేయ్.. ( మామ ఉత్సాహ పరిచాడు)
థాంక్యూ మామా.. ( గట్టిగా ఫోనులో చెప్పింది)
నువ్వు మాట తప్పావు.. అయినా నీ బదులు మా మామకు టీ ఇచ్చాను. (తనలో తాను గొణుక్కుంది కప్పు పట్టుకుని)
బై ..బై.. స్ట్రేంజర్ మామా.. ( గొంతులోపల్నుంచి సన్నగా వచ్చాయి ఆ మాటలు )
అదే నవ్వు.. పొలంలోని మామ నోటి వెంట…
బై..బై…
బై బై … ఒకరికొకరు ఫోను లో వీడ్కోలు…





Discussion about this post