‘…….’ ఎందుకు?
హితులందరికీ నమస్సులు..
ప్రపంచం మొత్తం ఇంటర్నెట్ బాట పట్టిపోతున్నప్పుడు, స్కూళ్లన్నీ ఇంగ్లిషు మీడియాన్ని ఇష్టంగా పులుముకుంటున్నప్పుడు తెలుగు భాష కోసం, తెలుగు సాహిత్యం కోసం కొత్త ప్రయత్నం అవసరమా? అనే సందేహం సహజం. ఆ సందేహాన్ని నివృత్తి చేసే ప్రయత్నం ఇది.
తెలుగు సాహిత్యం సుసంపన్నమైనది. తెలుగులో సాహిత్య సృజన కూడా తక్కువేమీ కాదు. వర్తమానంలో కూడా నిత్యం అనేకులు సాహిత్య సృజనలో తమ ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. అయితే.. ఇవి సాహిత్యాసక్తు లందరికీ చేరుతున్నాయా? అనేది ప్రశ్న. చేరడం అటుంచి, చదివే ఆసక్తి ఉన్న ప్రతిఒక్కరికీ సమంగా అందుబాటులో ఉన్నాయా? అందరి దృష్టికి వెళుతున్నాయా? అనేది పెద్ద ప్రశ్న. ఇందుకు అనేక కారణాలున్నాయి.
సాంప్రదాయంగా మన మెదళ్లు ఒక ఆలోచనకు అలవాటు పడిపోయాయి. సాహిత్యాన్ని చదవడం అంటే.. ముద్రణ రూపంలో పుస్తకాలను చదవడం మాత్రమే అనే ధోరణికి మనం అలవాటు పడిపోయాం. అందివస్తున్న ఆధునిక సాంకేతిక ధోరణులు, మారుతున్న అలవాట్లు ఇలాంటి వాటి దృష్ట్యా సాహిత్యాన్ని ప్రజలకు అందించే పత్రికలు, పుస్తకాల సంఖ్య తగ్గింది. తదనుగుణంగా రాసేవాళ్లు కూడా తగ్గారు. సాహిత్య సృజనే తగ్గుతోంది గనుక.. చదివేవాళ్లు కూడా తగ్గారు.
‘చదివేవాళ్లు, అచ్చు వేసేవాళ్లుంటే రాయడానికి ఏముంది?’ అని రచయితలు అంటారు. ‘మంచి సాహిత్యం రాసేవాళ్లు, కొని చదివేవాళ్లుంటే అచ్చు వేయడానికి ఏముంది?’ అని ప్రచురణకర్తలు అంటారు. ‘రాసేవాళ్లూ వేసేవాళ్లూ ఉంటే చదవడానికేముంది?’ అని పాఠకులు అంటారు. దానాదీనా ఇదంతా చెట్టుముందా విత్తుముందా అనే తరహా త్రిగుణ మీమాంసకు, తెగని చర్చకు దారితీస్తుంది.
కానీ, ఫేస్‌బుక్‌లలో, సోషల్ మీడియా పోస్టుల్లో కొన్ని మంచి రచనలు చూస్తున్నప్పుడు.. అవి అనేకానేక ఫార్వర్డ్‌లతో బహుళవ్యాప్తిలోకి వెళ్లడాన్ని గమనిస్తున్నప్పుడు రాసేవాళ్లకు, చదివేవాళ్లకు కొరతలేదనిపిస్తుంది. ఎటూ అవి వారి వారి ఆప్తబృందాల్లో అందరికీ అందుతూనే ఉన్నాయి. ఎటొచ్చీ ప్రచురించేవాళ్లే తగ్గారు. మారుతున్న సామాజిక పరిణామాల్లో ఇది చాలా సహేతుక పరిణామం. కొత్త సాంకేతికతల భయం- ప్రచురణకర్తల్ని వెన్నాడుతోంది. ‘ముందుముందు ఎలా ఉంటుందో’ అనే గుంజాటన వారిని వెనక్కు లాగుతోంది. తెలుగు చదివేవాళ్లు లేరు.. ప్రభుత్వాలే తెలుగును చంపేస్తున్నాయి.. రేపటితరానికి తెలుగు చదవడమే రాదు.. ఇలాంటి మీమాంసలను ముందుకునెట్టి ప్రచురణ ఆపేస్తున్నారు. ఆస్పత్రి పాలైన రోగికి చికిత్స అందించే బదులు, ఆక్సిజన్ కూడా తీసేసి చంపేస్తే అసలే తకరారూ లేదు కదా.. అనే వాదనలాగా ఇదంతా ఉంటుంది.
పైగా, చవకలో దృశ్యరూపంలో వీడియోలుగా షార్ట్ ఫిలింలు, సిరీస్ వంటి అనేక రూపాల్లో ఏదో ఒక వినోదం ప్రజలకు అందుతూనే ఉంది. అయితే చిన్న సినిమాగా ఒక కథను చూసినప్పుడు కలిగే ఆనందానికి, చదువుతూ పొందే ఆనందానికి చిన్న తేడా ఉంది. ప్రేక్షకుడిగా చూస్తే అందులోని పాత్రల్లో మాత్రమే మనం లీనం అవుతాం. పాఠకుడిగా ‘చదువుతూ చూస్తే’ దానిని విజువలైజ్ చేసుకుంటూ అనుభూతించే ప్రయత్నంలో పాత్రల్లాగానే, దర్శకుడిగా కూడా మనం అనుభూతి చెందుతాం. కానీ ప్రచురణలు తగ్గిపోవడం పెద్ద లోటు. కరోనానంతర పరిణామాల్లో మీడియా మీద పడిన దెబ్బ, అనేక పత్రికల మూసివేతకు దారితీసింది. నవ్య వీక్లీ, ఆంధ్రభూమి వీక్లీతో ప్రారంభమై చతుర, విపుల, తెలుగువెలుగు, బాలభారతం పత్రికలు మూతపడ్డాయి. రాసేవాళ్లకి, సంఖ్య తగ్గుతున్నప్పటికీ చదివేవాళ్లకి ఒక లోటు ఏర్పడింది.
ఆ లోటును అనేక ఆన్‌లైన్ పత్రికలు చక్కగా భర్తీ చేస్తున్నాయి. చాలా పత్రికలు ప్రజలకు సాహిత్యాన్ని అందిస్తున్నాయి. సాంకేతికత కొత్త పుంతలు తొక్కుతుండడం వల్ల సాహిత్యానికి జరుగుతున్న మంచి పరిణామం ఆన్‌లైన్ పత్రికలు. పోటీపడి నడుపుతున్న పత్రికలు కావు ఇవి. కేవలం సాహిత్యం కోసం నడుస్తున్న పత్రికలు. వీటిలో చాలా వరకు ఉచితంగానే పాఠకులకు అందుతున్నాయి. ఈ రంగంలో కొత్తవి రావడం.. ఎవ్వరి ‘మార్కెట్’నూ దెబ్బతీసే అవకాశం లేదు. చదివేవాళ్లు అన్నింటినీ చదువుకుంటారు. అందుకే తెలుగు సాహిత్యానికి ప్రచురణల పరంగా కొత్తగా ఏర్పడుతున్న లోటును భర్తీ చేయడానికి జరుగుతున్న అనేకానేక కొత ప్రయత్నాల్లో.. మా ప్రయత్నం కూడా ఒకటి.
‘……………………. తెలుగు సాహిత్య మాసపత్రిక’ కేవలం తెలుగు సాహిత్యానికి మాత్రమే పరిమితం అవుతున్న వెబ్ పత్రిక. డాక్టరు సలహాలు, వంటింటి చిట్కాలు, అందాన్ని దిద్దుకునే విషయాలూ ఇందులో ఉండవు. తెలుగు సాహిత్యం మాత్రమే ఉంటుంది. ఇప్పుడున్న సాహిత్య పత్రికలు website/ text ఫార్మాట్‌లో ఎక్కువగా అందుబాటులో ఉన్నాయి. కొందరు pdf book/flipbook రూపంలో అందిస్తున్నారు.
‘……………………. తెలుగు సాహిత్య మాసపత్రిక’ ఈ రెండు ఫార్మాట్లలోనూ పాఠకులకు అందుబాటులో ఉంటుంది. వెబ్‌సైట్ లో టెక్ట్స్ ఫార్మాట్‌లో అందరూ చదువుకోవచ్చు. ప్రతినెల సంచిక విడుదల అయిన రోజునే (పబ్లిష్ అయిన రోజునే) flipbook రూపంలో కూడా సైట్‌లో అందుబాటులో ఉంటుంది. దానిని పాఠకులు పీడీఎఫ్ పుస్తకంగా డౌన్లోడ్ చేసుకోవడానికి కూడా వెసులుబాటు ఉంటుంది. కొన్ని వెబ్ పత్రికలు text రూపంలో మాత్రం, కొన్ని flipbook రూపంలో మాత్రం ఇస్తుండగా ‘……………………. తెలుగు సాహిత్య మాసపత్రిక’ మాత్రం ఈ రెండు ఫార్మాట్లను మేళవించి పాఠకులకు అందిస్తుంది.
ఇదే సమయంలో వయస్సు పైబడిన వారు, కొత్త సాంకేతికతను అందిపుచ్చుకోలేని వారు కూడా అనేకులు ఉన్నారు. సాహిత్యం చదివే ఇష్టం ఉన్నది గానీ.. ఇంటర్నెట్ వాడకం తెలియని వాళ్లు కూడా ఉన్నారు. అలాంటి వారి కోసం- ‘……………………. తెలుగు సాహిత్య మాసపత్రిక’ ప్రింట్ మేగజైన్ రూపంలో కూడా అందుబాటులో ఉంటుంది. వారు విధిగా చందా చెల్లించి పోస్టు/కొరియర్ ద్వారా ‘……………………. తెలుగు సాహిత్య మాసపత్రిక’ను తెప్పించుకోవచ్చు.
మా ఉద్దేశం.. తెలుగు సాహిత్యానికి మన శక్తిమేర వ్యాప్తి కల్పించడం మాత్రమే. అందుకే ‘………………….’ వెబ్‌సైట్‌లో ఇతర ఆన్‌లైన్ సాహిత్య పత్రికలన్నింటి చిరునామాలను కూడా లింక్‌ల రూపంలో ఇస్తున్నాం. చదివడం ఇష్టమైన వాళ్లు ‘……………………. తెలుగు సాహిత్య మాసపత్రిక’తో పాటు వాటన్నింటినీ కూడా చదవండి.. సాహిత్యాన్ని ఆస్వాదించండి. సాహిత్యం మాత్రమే కాదు, భాష కూడా సజీవంగా ఉండాలంటే.. చదివే ఇష్టం ఉన్న ప్రతిఒక్కరూ చదువడాన్ని ఆపకపోవడమే మార్గం. మనం చదవడంతో పాటు, మరొకరికి చదవడాన్ని అలవాటు చేయడం ముఖ్యం. తమకు నచ్చిన ప్రతి దానినీ తామెరిగిన పదిమందికీ షేర్ చేసి అందరితోనూ చదివింపజేయడం అవసరం. ఇలా చదివే అలవాటు ఒకరినుంచొ మరొకరికి అంటుకుంటూ ఉంటే.. ఆధునిక ధోరణలు, సాంకేతిక విప్లవాలు కొత్త పుంతలు తొక్కుతున్న తీరులోనే.. తెలుగు సాహిత్యం కూడా.. మరింత సమృద్ధంగా, సముజ్వలంగా మారుతుంది.
ఆదరించి ప్రోత్సహిస్తారని ఆశిస్తూ.. కృతజ్ఞతలతో..
.. కె.ఎ. మునిసురేష్ పిళ్లె
ఎడిటర్, 99594 88088


